మే 11 నుండి శ్రీ పద్మావతి అమ్మ వారి వసంతోత్సవాలు
NEWS Apr 27,2025 07:34 am
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించ నున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.